హైడ్రా రికవరీ చేసిన భూముల విలువెంతో తెలుసా..!


TELAMGANA:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ విన్నా.. ఏ నోట విన్నా.. హైడ్రా.. హైడ్రా.. హైడ్రా అనే పేరే వినిపిస్తోంది. కేవలం హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలనే లక్ష్యంతో ఏర్పాటైన హైడ్రా కోసం జిల్లా నుంచి కూడా డిమాండ్ వచ్చింది. తమతమ జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలని కోరారు. దానిపై ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్లకు ఆ బాధ్యత అప్పగించారు.  


హైడ్రా ఏర్పాటు నుంచే కబ్జాదారుల్లో, అక్రమాలకు పాల్పడిన వారి వెన్నులో వణుకుపుడుతోంది. ఎప్పుడు ఎవరికి ఎలాంటి నోటీసులు అందుతాయా..? లేదంటే ఏ ఆస్తి విధ్వంసానికి గురవుతుందా..? అని టెన్షన్ పడుతున్నారు. పేద, ధనిక, పొలిటికల్, సినిమా స్లార్లు అని తేడా లేకుండా హైడ్రా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. దీంతో ఏ స్థాయిలో ఉన్న వారికైనా భయాందోళన వీడడం లేదు. అంగుళం ప్రభుత్వ స్థలాన్ని కూడా వదలిపెట్టకుండా మొత్తం రికవరీ చేయాలనే లక్ష్యంతోనే హైడ్రా ముందుకు సాగుతోంది. 

ఇదిలా ఉండగా.. హైడ్రా ఇప్పటివరకు ఎన్నో కట్టడాలను కూల్చి ప్రభుత్వ ఆస్తులను రికవరీ చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ మేరకు ప్రభుత్వానికి ఇటీవలే నివేదిక సైతం సమర్పించారు. ఏజెన్సీ జూన్ 27న తన కార్యకలాపాలను ప్రారంభించింది. అప్పటి నుంచే ఆస్తుల రికవరీ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 262 అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు కమిషనర్ వెల్లడించారు. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిమితుల్లో 23 ప్రాంతాలలో పనిచేసినట్లు తెలిపారు. 

అలాగే.. ఇప్పటివరకు 111.72 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు రంగనాథ్ తెలిపారు. అయితే.. స్వాధీనం చేసుకున్న భూముల విలువ చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు. మాదాపూర్‌లోని తమ్మిడికుంట, బంజారాహిల్స్‌లోని లోటస్ పాండ్, జూబ్లీహిల్స్‌లోని నందగిరి కొండలు వంటి హై ప్రొఫైల్ ఏరియాల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అందులో సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సైతం ఉంది. వాటన్నింటినీ తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటి విలువ భూముల మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రూ.వెయ్యి కోట్ల పైనే ఉంటుందంట.