TELAMGANA:
ఖమ్మం జిల్లా: ఖమ్మంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఖమ్మం నగరంలో వరద ముప్పు పెరగడంతో వరద బాధితులు మళ్లీ భయాందోళనలకు గురవుతున్నారు. మున్నేరు మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఖమ్మం వద్ద మున్నేరు ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. 10 అడుగులకు మున్నేరు ప్రవాహం చేరుకోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితులు ఖమ్మం నగరంలో నెలకొన్నాయి.
ఎడతెరిపి లేకుండా భారీ వర్షం ఖమ్మం నగరంలో కురుస్తోంది. దీంతో 10 అడుగులకు మున్నేరు ప్రవాహం చేరింది. మున్నేరు పరివాహక ప్రాంతాలైన రామన్నగూడెం, దానవాయిగూడెం, ప్రకాశ్ నగర్, మోతీ నగర్, వేంకటేశ్వర కాలనీ, పద్మావతి నగర్, పెద్దతండా, సాయి గణేష్ నగర్ మున్నేరు వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా...
ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో మున్నేరు వాగు ప్రవాహం మరోసారి పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ, మార్కెటింగ్, టెక్స్టైల్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అవసరమైతే సహాయక శిబిరాలు మళ్లీ తెరవాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.
జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను వెంటనే అక్కడి నుంచి తరలించాలని మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలకు వెళ్లాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సూచనలను పాటించి, తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులతో సంప్రదించాలని మంత్రి తుమ్మల కోరారు.
అధికారులు వెంటనే అన్నిరకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు, ప్రజలకు సహాయక చర్యలు నిరంతరం అందుబాటులో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు.
వైరాలో బారీ వర్షం...
ఖమ్మం జిల్లా: జిల్లాలోని వైరా, కొణిజర్ల, ఏన్కూరు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. కొణిజర్ల మండలం తీగల బంజర వద్ద పగిడేరు వాగు పొంగుతోంది. దీంతో పాటు అంజనాపురం - జన్నారం గ్రామాల మధ్య నిమ్మవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పల్లిపాడు నుంచి ఏన్కూర్కు రాకపోకలు పూర్తిగా బంద్ అవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.