మెదక్ జిల్లా, సిద్దిపేట: 78వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా దుబ్బాక గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాకలో చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. దుబ్బాక ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధి అవడం లేదని.. ముందుకు పోవడం లేదని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గం చుట్టు పక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందాయని.. కానీ దుబ్బాక అభివృద్ధి కావడం లేదన్నారు. దుబ్బాకకు రింగు రోడ్డు అవసరమని తెలిపారు. దుబ్బాకలో మొన్ననే బస్టాండ్, వందపడకల ఆసుపత్రి కట్టుకున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలల అయితుంది కానీ మనకు సహకారించడం లేదని కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
ఊరూవాడా మువ్వన్నెల జెండా...
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. గల్లీ గల్లీలోనూ జాతీయ పతాకం రెపరెపలాడుతోంది. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో, పరేడ్ గ్రౌండ్స్‌లలో మంత్రులు, ఎమ్మెల్యేలు జాతీయ జెండాలను ఎగురవేస్తున్నారు. ఆదిలాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో వైభవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ మువ్వెన్నల జెండా ఎగుర వేశారు. నిర్మల్ జిల్లా ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. జాతీయ జెండాను స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య ఆవిష్కరించారు. మంచిర్యాల కలెక్టరేట్‌లో ప్రభుత్వ సలహాదారు హర్కార వేణు గోపాల్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.