చార్మినార్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం.. 17 మంది మృతి..


TELANGANA: హైదరాబాద్‌లోని పాతబస్తీ మీర్‌చౌక్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. BY: BCN TV NEWS ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందారు. గుల్జార్‌హౌస్ సమీపంలోని ఒక భవనంలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం నాలుగు కుంటుంబాల సభ్యులు మంటల్లో చిక్కుకున్నారు. భవనంలో మొత్తం 30 మంది సభ్యులు ఉండగా.. అందులో రెస్క్యూ సిబ్బంది 10 మందిని కాపాడారు. మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో 10 మంది స్పృహ తప్పి అక్కడే పడిపోయారు.


మంటల్లో చిక్కుకున్న మరికొందరిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిని ఉస్మానియా, యశోద (మలక్‌పేట), డీఆర్డీవో, అపోలో ఆసుపత్రులకు తరలించారు. ఘటనాస్థలిలో ముగ్గురు చనిపోయినట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పదమూడు మంది మృతి చెందగా.. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించడానికి 14 అంబులెన్సులు ఘటనా స్థలికి చేరుకున్నాయి. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. చనిపోయిన వారిలో రాజేంద్రకుమార్‌ (67), అభిషేక్‌ మోదీ (30), సుమిత్ర (65), మున్నీబాయి (72), ఆరుషి జైన్‌ (17), శీతల్‌ జైన్‌ (37), ఇరాజ్‌ (2), హర్షాలీ గుప్తా (7), రజని అగర్వాల్‌, అన్య మోదీ, పంకజ్‌ మోదీ, వర్ష మోదీ, ఇద్దిక్కి మోదీ, రిషభ్‌ ప్రథమ్‌ అగర్వాల్‌, ప్రాంశు అగర్వాల్‌ ఉన్నారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ కంప్రెసర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనతో పాతబస్తీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రమాదం కారణంగా పాతబస్తీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. చార్మినార్ వెళ్లే రహదారులను మూసివేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడకు ఎవరూ రావొద్దని పోలీసులు హెచ్చరించారు. ఇటీవల హైదరాబాద్‌లో అగ్నిప్రమాద ఘటనలు ఎక్కువగా జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

పాతబస్తీలో చోటు చేసుకున్న ఈ అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రిఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీస్, ఫైర్ విభాగం చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి సరైన వైద్య సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. బాధితులకు అండగా ఉంటామని సీఎం వారికి భరోసా ఇచ్చారు. ఘటనా స్థలానికి మంత్రి పొన్నం చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.