TELANGANA: తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ కుట్రల వెనుక ఎవరున్నారో తనకు తెలుసని, సరైన సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు బయటపెడతానని కవిత అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. అనంతరం మీడియాతో అనధికారికంగా మాట్లాడుతూ , తాను పార్టీ బలోపేతం కోసమే కృషి చేస్తున్నానని స్పష్టం చేశారు. తాను పర్యటించిన 47 నియోజకవర్గాల్లో ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలనే తాను వ్యక్తపరుస్తున్నానని, పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించానని వివరించారు. పార్టీపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతున్న ఈ సమయంలో తనపై జరుగుతున్న దుష్ప్రచారం అభ్యంతరకరమని పేర్కొన్నారు.
"నన్ను రెచ్చగొట్టకండి" అంటూ ఘాటు వ్యాఖ్యలు నన్ను రెచ్చగొట్టకండి అంటూ కవిత తీవ్రంగా స్పందించారు. ఆరు నెలలు జైల్లో ఉన్నది సరిపోదా? ఇంకా నన్ను ఇబ్బంది పెడతారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను రెచ్చగొడితే మరింత గట్టిగా స్పందిస్తానని హెచ్చరించారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై పార్టీ నాయకత్వం స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల మేడే సందర్భంగా కవిత మాట్లాడుతూ, భౌగోళిక తెలంగాణ సాధించుకున్నా సామాజిక తెలంగాణ పూర్తిస్థాయిలో నెరవేరలేదని వ్యాఖ్యానించారు. ఇది బీఆర్ఎస్ పార్టీతో పాటు, గత పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వంపై పరోక్ష విమర్శగా ప్రత్యర్థులు పేర్కొన్నారు. ముఖ్యంగా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోని పరిపాలనపైనే కవిత విమర్శలు చేస్తున్నారనే చర్చ మొదలైంది. ఈ వ్యాఖ్యలు, ఆమె వైఖరి ఆధారంగానే కవిత బీఆర్ఎస్‌ను వీడి కొత్త పార్టీని స్థాపించే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారంపై స్పందిస్తూనే కవిత తాజాగా పై విధంగా వ్యాఖ్యలు చేశారు.
- ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు?
పార్టీలో అంతర్గత కలహాలా? తాజాగా తనను రెచ్చగొట్టవద్దని, రెచ్చగొడితే మరింత గట్టిగా స్పందిస్తానని కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతోందనే చర్చకు దారితీస్తున్నాయి. గత కొంతకాలంగా కేసీఆర్ కుటుంబంలో విభేదాలున్నాయనే ప్రచారం నేపథ్యంలో, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ రావు మధ్య పొరపొచ్చాలున్నాయని, అవి మరింత తీవ్రమై అంతర్గత పోరుకు కారణమయ్యాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కవిత ఈ రకమైన వ్యాఖ్యలు చేశారనే వాదన ఉంది. తన 'రెచ్చగొట్టవద్దు' అనే వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారన్నది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో సస్పెన్స్‌గా మారింది. ఈ పరిణామాలు బీఆర్ఎస్‌లో అంతర్గత కలహాలకు సంకేతాలా అనే గుసగుసలకు తావిస్తున్నాయి.