TELANGANA, కామారెడ్డి జిల్లా: పల్వంచ మండలం, భవానిపేట గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి అనే వ్యక్తి సైబర్ వలలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సైబర్ కేటుగాళ్లు వెంకట్ రెడ్డికి ఫోన్ చేశారు. అమెరికాలో ఉంటున్న మీ కుమార్తె మాధవి ఆపదలో ఉందని.. బెదిరింపు కాల్ చేశారు. ఆమె ఉంటున్న గదిలో మరో అమ్మాయి హత్యకు గురైందంటూ ఈ కేసు నుంచి మీ కూతురును తప్పించాలంటే రెండు లక్షలు ఖర్చవుతుందని, డబ్బులు పంపాలంటూ ఫోన్ చేశారు.
దీంతో భయపడిపోయిన వెంకట్ రెడ్డి మూడు దపాలుగా కలిపి లక్ష రూపాయలు పంపారు. తిరిగి ఫోన్ చేస్తే.. ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ రావడంతో వెంటనే అమెరికాలో ఉన్న తన కూతురికి ఫోన్ చేశారు. అంతా బాగానే ఉన్నట్లు తెలియడంతో సైబర్ కేటుగాళ్ల వలలో మోస పోయినట్లు గుర్తించిన బాధితుడు వెంటనే మాచారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.