రాజీవ్ విగ్రహంపై చెయ్యి వేస్తే.. KTRకి సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్


TELANGANA,హైదరాబాద్: దేశంలో ఎప్పుడు ఏ అంశాలపై రాజకీయ పార్టీలు గొడవ పెట్టుకుంటాయో చెప్పలేం. సడెన్‌గా ప్రాధాన్యం లేని అంశాలపై తిట్టుకుంటాయి. తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉంటే.. వాటి కంటే ముందు.. రాజీవ్ గాంధీ విగ్రహంపై గొడవకు ప్రాధాన్యం ఇచ్చుకుంటున్నాయి పాలక, ప్రతిపక్షాలు. ఓ పక్కన భారీ వర్షాలు కురుస్తుంటే.. దానిపై అన్ని పార్టీలూ కలిసి ముందుకు సాగడం మానేసి.. విగ్రహాల అంశంపై ఫోకస్ పెడుతున్నాయి అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయం ముందు, అమరవీరుల జ్యోతి పక్కన రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే, తాము అధికారంలోకి దాన్ని తొలగిస్తామని అనడంతో.. సీఎం రేవంత్ రెడ్డి ఊరుకుంటారా? గట్టిగా కౌంటర్ ఇచ్చారు.


రాజీవ్ గాంధీ 80 జయంతి సందర్భంగా సోమాజీగూడలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఆయన ఏమన్నారంటే.. “BRS నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదు. సెక్రటేరియట్ ముందు కేటీఆర్ వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకుందామనుకుంటున్నారు. సచివాలయం ముందు ఉండాల్సింది, ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్న వాళ్ల విగ్రహం కాదు. అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడుతున్నారు. చేతనైతే ఎవడైనా విగ్రహంపై చేయి వేయండి. నీ అయ్య విగ్రహం కోసం రాజీవ్ విగ్రహాన్ని తొలగించాలని అంటావా? అధికారంలోకి వస్తే అని మాట్లాడుతున్నాడు.. 

బిడ్డా.. మీకు అధికారం ఇక కలే.. ఇక మీరు చింతమడకకే పరిమితం. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారు. డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత మాది. మా చిత్తశుద్ధిని ఏ సన్నాసీ శంకించనవసరం లేదు. విచక్షణ కోల్పోయి అర్థం పర్ధం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తుంది. సచివాలయం ముందు దొంగలకు, తాగుబోతులకు స్థానం లేదు” అని అన్నారు.

ఈ సందర్భంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవల్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. “1980 దశకంలోనే దేశానికి సాంకేతికను పరిచయం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ. మహాత్మాగాంధీ స్పూర్తితో రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. మహిళలు రాజకీయాల్లో రాణించేందుకు ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ముందు ఏర్పాటు చేస్తాం. దేశ యువతకు స్ఫూర్తి ప్రధాత రాజీవ్ గాంధీ. రాబోయే కొద్ధి రోజుల్లో సచివాలయం ఎదురుగా పండుగ వాతావరణంలో రాజీవ్ గాంధీ విగ్రాహాన్ని ఆవిష్కరిస్తాం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.