ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల: రెండు లక్షల లోపు బ్యాంకు రుణాలున్న రైతులకు ఏక మొత్తంలో మాఫీ చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం మాటను నిలబెట్టుకుంది. మూడు విడుతల్లో రూ. 2 లక్షల లోపు రుణం ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమచేసింది. ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు రూ. 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9వ తేదీ మధ్య కాలంలో తీసుకున్న రుణాలు మాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడింది. ఆగస్టు 15వ తేదీలోపు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ప్రకటించగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేసింది. ఏదైనా కారణం చేత అర్హత ఉండి రుణ మాఫీ జరగని రైతులకు ప్రభుత్వం పరిశీలన జరిపి తిరిగి రుణమాఫీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అలాగే రూ.2 లక్షల పైబడి రుణం ఉన్నవారికీ మాఫీ చేయనున్నట్లు కూడా కాంగ్రెస్ సర్కారు ప్రకటించింది.
జిల్లాలో 53వేల పైచిలుకు రైతులకు లబ్ధి
ప్రభుత్వ నిర్ణయం మేరకు రుణమాఫీ పథకానికి జిల్లాలో 53వేల పై చిలుకు మంది రైతులు అర్హత కలిగి ఉన్నట్లు బ్యాంకర్ల సమాచారం మేరకు ప్రభుత్వం గుర్తించింది. జిల్లా వ్యాప్తంగా లక్షా 57వేల మంది రైతులు ఉండగా వివిధ రకాల పంటలు 3.42 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. జిల్లాలో ఉన్న రైతుల్లో 25వేల మంది కౌలు రైతులు కూడా ఉన్నారు. ఐదెకరాల పైబడి ఉన్న రైతులకు మాత్రమే బ్యాంకర్లు రూ. 2 లక్షల వరకు రుణం మంజూరు చేస్తున్నారు. వానాకాలం సీజన్ నుంచి రూ. 2 లక్షల వరకు పంట రుణం తీసుకున్న వారిలో 94వేల మంది వరకు ఉన్నట్లు బ్యాంకర్లు ప్రాథమికంగా గుర్తించగా మూడు విడుతల్లో ఇప్పటి వరకు 53 వేల పై చిలుకు మందికి రుణమాఫీ చేసింది. యేటా తీసుకున్న రుణాలను రెన్యూవల్ చేసుకుంటూ కొత్త రుణాలు పొందినట్లు బ్యాంకర్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. జిల్లాలో యేటా వానాకాలం, యాసంగి పంట రుణాల కింద రూ. 1600 కోట్ల వరకు బ్యాంకులు ఇస్తున్నాయి.
మూడు విడుతల్లో 53వేల మందికి లబ్ధి
ప్రభుత్వ నిర్ణయం మేరకు మొత్తం మూడు విడుతల్లో జిల్లాలోని 53,442 మందికి రుణమాఫీ కింద రూ. 465 కోట్ల 17 లక్షల 59వేల 201ను బ్యాంకుల్లో జమచేసింది. మూడో విడుతలో జిల్లా వ్యాప్తంగా 10,611 మంది రైతులను ఎంపిక చేశారు. వీరికి రూ. 175 కోట్ల 43 లక్షల 83 వేల 912ను బ్యాంకుల రుణ ఖాతాల్లో జమ చేశారు. అలాగే రెండో విడుతలో జిల్లాలో 14,104 మంది రైతులను ఎంపిక చేయగా, వీరికి గత నెల 30న మొత్తం రూ. 138 కోట్ల 46 లక్షల 56వేల254 ను ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఇదిలా ఉండగా మొదటి విడుత రుణమాఫీని ప్రభుత్వం జూలై 18న రైతు ఖాతాల్లో జమ చేయగా, మొత్తం 28,727 మందికి రూ. 151 కోట్ల 27 లక్షల 19వేల 35ను చెల్లించింది. మొదటి, రెండు విడుతల్లో వివిధ కారణాల చేత రుణమాఫీ జరగని సుమారు 350 మంది అర్హతగల రైతులను అధికారులు గుర్తించారు. వీరికి దాదాపు రూ.కోటి యాభై లక్షల వరకు బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది.
అప్పు మొత్తం తీరిపోయింది...పుప్పాల నారాయణ, నెన్నెల
పంట పెట్టుబడి కోసం బ్యాంకులో తీసుకున్న అప్పు మొత్తం తీరిపోవడం సంతోషంగా ఉంది. మాఫీ డబ్బులు రూ. 1,99,122లు నా ఖాతాలో జమ అయ్యాయి. రైతుల కష్టం తెలిసిన సీఎం రేవంత్‌రెడ్డి ఏకకాలంలో రూ. 2 లక్షల పంట రుణం మాఫీ చేయడంతో రైతాంగానికి అప్పుల బాధ తీరినట్లయింది. గతంలో విడతల వారిగా మాఫీ చేయడంతో వడ్డీ మాత్రమే తీరి, అసలు అలాగే ఉండేది. ఇప్పుడు మొత్తం రుణ విముక్తి అయింది.