సీఎం రేవంత్ పై తీవ్ర ఆరోపణలు చేసిన కేటీఆర్


TELANGANA: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఓవైపు మూసీ నిర్వాసితులు.. మరోవైపు హైడ్రా కూల్చివేతల భయాందోళనల నేపథ్యంలో బాధితులు పలువురు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి రావటం.. తమ గోడును వినిపించుకోవటం లాంటి కార్యక్రమాలు చేస్తూ.. మరోవైపు ఆయా ప్రాంతాల్లో పార్టీ సీనియర్ నేతలు పర్యటిస్తూ.. కూల్చివేతలకు అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసా ఇస్తున్నారు. ఇటీవల కాలంలో మాంచి జోరు మీదకు వచ్చిన బీఆర్ఎస్ కు తగ్గట్లే.. ఆ పార్టీ ముఖ్యనేత కేటీఆర్ తన వరుస ట్వీట్లతో రేవంత్ సర్కారును చీల్చి చెండాతున్నారు. 


రోజుకు నాలుగైదు ట్వీట్లకు తక్కువ చేయని ఆయన తీరును ముఖ్యమంత్రి రేవంత్.. ట్విట్టర్ టిల్లు అంటూ ఎక్కెసం చేయటం తెలిసిందే. అయినప్పటికీ ఇసుమంత కూడా తగ్గకుండా ట్వీట్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.తాజాగా మూసీ సుందరీకరణతో పాటు.. మూసీని ప్రక్షాళన చేసే భారీ ప్రాజెక్టును రేవంత్ సర్కారు చేపట్టటం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు కేటీఆర్. మూసీ ప్రక్షాళన కోసం చేపట్టిన ప్రాజెక్టు రూ.లక్ష కోట్లకు పైనే అంటూ సీఎం రేవంత్ పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే. 

అయితే.. ఈ కారణంగావేలాది మంది జీవితాలు రోడ్డు మీద పడుతున్నట్లుగా కేటీఆర్ ఆరోపిస్తున్నారు. తాజాగా ఆయన ట్వీట్ చూస్తే.. సీఎం మీద నిప్పులు చెరిగారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.150 లక్షల కోట్ల ధన దాహానికి ఒకటా రెండా హైదరాబాద్ నగరంలోని లక్షల మంది జీవితాలు చెల్లాచెదురవుతున్నాయని.. నగరం రోదిస్తోందని పేర్కొన్నారు. కూల్చివేతలతో ప్రజల గుండెలు పగిలిపోతున్నట్లుగా ఫైర్ అయ్యారు. 

వారి ఇళ్లు చెదిరిపోతున్నాయి. ఆడబిడ్డల ఆవేదనలు, ఇంటి పెద్దల శాపనార్థాలతో నగరం రోదిస్తోంది. రెక్కలు ముక్కలు చేసుకుని కట్టుకున్న కుటీరాలను కన్నబిడ్డలకు ఇవ్వలేకపోతున్నామని తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. అమ్మ లాంటి ఇల్లు వదిలి వేరే దిక్కు ఎలా పోతామంటూ గుండెలు బాదుకుంటున్నారు. ఆడబిడ్డకు కట్నంగా ఇచ్చే ఇల్లు కూలుస్తారేమో అని ఆత్మహత్య చేసుకున్న తల్లి ఒకవైపు, భార్య కడుపుతో ఉన్నా కనికరించరా అంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకున్న భర్త మరోవైపు’’ అంటూ తీవ్రతను తెలిపేలా ట్వీట్లు చేశారు. 

బీఆర్ఎస్ హయాంలో రైతుల ప్రయోజనం కోసం 30వేల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే రిజర్వాయర్ నిర్మాణం విషయంలో రైతులను రెచ్చగొట్టి శవరాజకీయాలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నావ్? అంటూ ప్రశ్నించారు. ‘‘ఆనాడు అలా చేసి నేడు నీ అవసరానికి ఎంత నీచానికైనా తెగిస్తావని మరోమారు నిరూపించావు. మహా నగర ప్రజలారా మీరు అధైర్య పడొద్దు. ఇప్పుడు జరుగుతున్న విధ్వంసంతో తొందరపడి ప్రాణాలు బలితీసుకోవద్దు. న్యాయస్థానాలు ఉన్నాయి. మీకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది" అని కేటీఆర్ ట్వీట్ చేశారు. 

మరో ట్వీట్ లో అమృత్ పథకంలో భారీ అవినీతి చోటు చేసుకుందన్న ఆరోపణలు చేసిన కేటీఆర్.. ఇటీవల ఆయనకు లీగల్ నోటీసులు వెళ్లటం తెలిసిందే. ఈ అంశాల మీద ప్రస్తావిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ బావమరిదితో లీగల్ నోటీసులు పంపితే మాట్లాడటం బంద్ చేస్తానని అనుకుంటున్నావా? అంటూ ఫైర్ అయ్యారు. ‘‘బావమరిదితో లీగల్ నోటీసు పంపితే నీ ఇల్లీగల్ దందాల గురించి మాట్లాడుడు బంద్ చేస్తా అనుకుంటున్నావా?బావ మరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోం. 

ముఖ్యమంత్రి ఆయన డిపార్ట్మెంట్ లోనే ఆయన బావమరిది శోద కంపెనీకి ₹1,137 కోట్ల టెండర్ కట్టబెట్టింది నిజం. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్స్ 7, 11, 13 ని ముఖ్యమంత్రి ఉల్లంఘించిన మాట నిజం.శోద అనే కంపెనీ గత రెండు సంవత్సారాలుగా రెండు కోట్లు మాత్రమే లాభం ఆర్జించిన ఒక చిన్న కంపెనీ. ఢిల్లీ లో ఉన్న నీ బీజేపీ దోస్తులు కూడా నిన్ను కాపాడడం కష్టమే. ఈ దేశంలో న్యాయవ్యవస్థ బలంగా, నిజాయితీగా ఉన్నది. నీకు ఆదర్శ్ కుంభకోణంలో అశోక్ చవాన్ లాగా, నువ్వు దొరికావు. రాజీనామా తప్పదు’’ అంటూ హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు.