TELAMGANA, HYDERABAD:
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒకపై ప్రతి నెలా ఆస్తిపన్ను చెల్లించేలా ఒక విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చేందుకు వీలుగా కసరత్తు సాగుతోంది. సరికొత్త ప్రయోగానికి తెర తీసింది రేవంత్ సర్కార్. ఇప్పటివరకు ఆర్నెల్లకు ఒకసారి పన్ను చెల్లింపులు జరిపే విధానాన్ని స్వస్తి పలికి కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకు రానున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు.. ఎలా అయితే విద్యుత్ బిల్లులు ప్రతి నెలా చెల్లించాలో.. అదే తరహాలో ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ.. బకాయిలు ఉన్న వారిపై చర్యలు తీసుకునేలా ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు.
అంతేకాదు.. ఆస్తిపన్ను.. నల్లా.. విద్యుత్ బిల్లుల చెల్లింపులను ఒకదానితో మరొకటి అనుసంధానం చేయటం ద్వారాపేమెంట్ యాప్ ల ద్వారా చెల్లించే విధానాన్ని తెర మీదకు తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. రెండు రోజులక్రితం జీహెచ్ఎంసీ పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన సమీక్ష నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా చెత్తసేకరణ ఛార్జీలను సైతం ఆన్ లైన్ లో చెల్లించే వెసులుబాటును పరిశీలిస్తున్నట్లు సమాచారం.
పేమెంట్ యాప్ ల ద్వారా పన్నులు.. ఛార్జీల వసూలు చేపడితే బకాయిలు పేరుకు పోయే అవకాశం ఉండదని ప్రభుత్వం భావిస్తున్నట్లు అంచనావేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఆర్నెల్లకు ఒకసారి ఆస్తిపన్నువసూలు చేయటం.. నల్లాబిల్లు విషయానికి వస్తే 20వేల లీటర్లకు మించి నీటిని వాడే వారి నుంచి మాత్రమే బిల్లులు వసూలుచేస్తోంది. మొదటి 20 వేల లీటర్లు ఉచితంగా తాగునీటిని అందిస్తున్న సంగతి తెలిసిందే.
కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో ఆలస్యమైతే అపరాధ రుసుం వసూలు చేస్తున్న తరహాలోనే జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను వసూళ్లలోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తారని చెబుతున్నారు. విద్యుత్ బిల్లులను ఏ విధంగాఅయితే పేమెంట్ యాప్ ల ద్వారా చెల్లించే సౌకర్యం ఉంటుందో.. అదే తరహాలో ఆస్తిపన్ను వసూళ్లకు సైతం అదే విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన చేసినట్లుగా చెబుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన విధానపరమైన నిర్ణయం వెలువడుతుందని తెలుస్తోంది.