ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై మంత్రులతో సీఎం భేటీ..


హైదరాబాద్: ‘ఫ్యూచర్‌ సిటీ’ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి పొంగులేటి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అధికారులు హాజరై ఫ్యూచర్ సిటీపై చర్చించారు. అలాగే హౌసింగ్ అండ్ అర్బన్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్  ఛైర్మన్ సంజయ్ కులక్షేత్ర, ఇతర ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ఎయిర్ పోర్టు నుంచి నాలుగో నగరానికి రోడ్, మెట్రో కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఫ్యూచర్ సిటీకి తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.


అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని దిగ్గజ కంపెనీలను కోరారు. శుక్రవారం దిల్లీలోని తన అధికార నివాసంలో ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ యంగ్‌ లియూతో ఆయన భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ త్రినగరానికి అనుబంధంగా నాలుగో నగరం ‘ఫ్యూచర్‌ సిటీ’ని అభివృద్ధి చేస్తోందని, అందుకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టాలని కోరారు. అలాగే ఇటీవల అమెరికా, దక్షిణ కొరియా వెళ్లిన సీఎం పలు కంపెనీలకు ఆహ్వానం పలికారు. నాలుగో నగరంలో పెట్టుబడులు గేట్లు తెరిచారు. అక్కడే పలు కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు.

ఫ్యూచర్ సిటీలో విద్య, వైద్యం, క్రీడలు, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సహా పలు రంగాలను విస్తరించనున్నట్లు సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఆధునిక సమాజంలో యువతకు అవసరమైన నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీని కూడా దసరా పండగ రోజు నుంచి ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగానే ఆ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్‌ మహీంద్ర, వైస్‌ఛైర్మన్‌గా శ్రీనివాసరాజును నియమించారు. అయితే తాజాగా ఫ్యూచర్ సిటీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులతో కలిసి కసరత్తు చేస్తున్నారు.