హైద‌రాబాద్‌ గ‌చ్చిబౌలిలో 4 కోట్ల విలువైన డ్ర‌గ్స్


హైద‌రాబాద్‌: ఎప్ప‌టిక‌ప్పుడు డ్ర‌గ్స్‌ను కంట్రోల్ చేస్తున్నా.. ఎన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను పెట్టి అడ్డుకుంటున్నా.. తెలంగాణ రాజ ధాని హైద‌రాబాద్‌లో డ్రగ్స్ క‌ల‌క‌లం కొన‌సాగుతూనే ఉంది. అర్ధ‌రాత్రి, తెల్ల‌వారుజామున కూడా ఇటీవ‌ల కాలంలో పోలీసులు నిఘా పెంచారు. అనుమానం వ‌చ్చిన వారిని అరెస్టు కూడా చేస్తున్నారు. డ్ర‌గ్స్‌ను ఎట్టిప‌రిస్థితిలోనూ క‌ట్టడి చేయాల‌న్న ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి పిలుపును అందుకుని పోలీసులు త‌మ ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నారు.


కానీ, డ్రగ్స్ స‌ర‌ఫ‌రా, ర‌వాణా మాత్రంకొన‌సాగుతూనే ఉంది. తాజాగా గ‌చ్చిబౌలిలో 4 కోట్ల రూపాయ‌ల విలు వైన డ్ర‌గ్స్‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. దీంతోపాటు రాజ‌స్థాన్‌కు చెందిన డ్ర‌గ్స్ ముఠాను కూడా అరెస్టు చేశారు. గ‌చ్చిబౌలిలో పోలీసులు త‌నిఖీలు చేప‌ట్ట‌గా.. ఈ ముఠా గుట్టు ర‌ట్ట‌యింద‌ని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి అర‌కిలోకు పైగా హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నామ‌ని వివ‌రించారు. హెరాయిన్ విలువ బ‌హిరంగ మార్కెట్‌లో 4 కోట్ల రూపాయ‌ల పైమాటేన‌ని వివ‌రించారు.

ఇదిలావుంటే.. విదేశాల నుంచి తిరిగి వ‌చ్చాక కూడా.. సీఎం రేవంత్ రాష్ట్రంలో డ్ర‌గ్స్‌ను కంట్రోల్ చేయాలంటూ.. పోలీసుల‌ను ఆదేశించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఆయ‌న ఆదేశించిన రోజే త‌నిఖీలు చేప‌ట్ట‌గా.. పెద్ద ఎత్తున ఇలా డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డ‌డంతో అంద‌రూ నివ్వెర పోయారు. గచ్చిబౌలిలోని టెలికాంనగర్‌లో నిర్వహించిన సోదాల్లో 4 కోట్ల విలువైన డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డ‌డంతో న‌గ‌రం నివ్వెర పోయింది. దీంతో రానున్న రెండు మూడురోజ‌ల్లో న‌గ‌రాన్ని మ‌రింత జ‌ల్లెడ ప‌ట్ట‌నున్న‌ట్టు పోలీసులు తెలిపారు.